AP News | కడప జిల్లాకు చెందిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి బాగోతం వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్లుమూసుకుపోయిన అతను.. మహిళా ఉద్యోగిని ఇంటికెళ్లి మరీ తన కోరిక తేర్చాలని వేధింపులకు గురిచేశారు. అతని వేధింపులతో విసిగిపోయిన సదరు ఉద్యోగిని తన భర్తకు చెప్పడంతో ఆఫీసుకెళ్లి మరీ చితకబాదాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో సదరు డీటీసీపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది.
కడప జిల్లా డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి తమ కార్యాలయంలోనే పనిచేసే మహిళా బ్రేక్ ఇన్స్పెక్టర్ను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇటీవల అతని వేధింపులు శ్రుతిమించాయి. తాజాగా సదరు మహిళా ఉద్యోగిని ఇంటికి వెళ్లే కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. డీటీసీ వేధింపులతో విసిగిపోయిన సదరు మహిళా ఉద్యోగిని బాస్ నిర్వాకాన్ని భర్తకు చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డీటీసీ చంద్రశేఖర్ రెడ్డిని చితకబాదాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి మిగతా ఉద్యోగులను మేనేజ్ చేశాడు. కానీ డీటీసీ వేధింపులపై సదరు మహిళా ఉద్యోగిని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
డీటీసీ చంద్రశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు రావడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపారు. ఈ క్రమంలోనే బాపట్ల, శ్రీకాకుళంలో పనిచేసిన సమయంలోనూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. అతనిపై అప్పటికే నాలుగు కేసులు కూడా నమోదయ్యాయని సమాచారం. దీంతో డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. అతనిపై బదిలీ వేటు వేసింది. రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ రవాణా శాఖ కమిషనర్ మండిపల్లి రాంప్రసాద్ ఆదేశించారు.