JC Prabhakar Reddy | అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయాలు కాకరేపుతున్నాయి. గత కొద్దిరోజులుగా కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా.. జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు యత్నించినప్పటికీ అది కుదరలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి పంతమే నెగ్గింది. ఈ నేపథ్యంలోనే దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాలు విసిరారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తనకు ఎలాంటి కక్ష లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కానీ ఆయన చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆర్డర్ ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావచ్చని తెలిపారు. అయితే గతంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ టీడీపీ నాయకులను కేతిరెడ్డి తాడిపత్రిలోకి అనుమతించలేదని గుర్తుచేశారు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రావడానికి ఒప్పుకోమని ఆయన స్పష్టంచేశారు. ఆయన తాడిపత్రిలోకి రావడం కాదు.. ముందు ఆయన అక్రమంగా కట్టిన ఇంటి సంగతి చూసుకోవాలని హితవుపలికారు. అనవసరంగా పోలీసులపై ఆరోపణలు చేయవద్దని సూచించారు.
కాగా, తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆయన్ను అనుమతించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేతిరెడ్డి.. జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది జేసీనా లేక ప్రభుత్వమా అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నేను ఫ్యాక్షనిజం చేయలేదని.. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.
హై కోర్ట్ ఆదేశాల ఉన్న పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
హై కోర్ట్ ఆదేశాల మేరకు తాడిపత్రి వెళ్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు#KathireddyPeddaReddy #Tadipatri #YSRCP #AndhraPradesh #Tupaki pic.twitter.com/nobG9DEvJp
— Tupaki (@tupaki_official) August 18, 2025