Chandrababu | స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును (Chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) నేడు కలువనున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా మూలాఖత్ కానున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయనతో భేటీ కానున్నారు. సుమారు 40 నిమిషాలపాటు జైలు అధికారులు సమయం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు పవన్, బాలకృష్ణ రాజమండ్రి జైలుకు చేరుకోనున్నారు. భేటీ అనంతరం పవన్ హైదరాబాద్ రానున్నారు. దీంతో జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కాగా, చంద్రబాబు అరెస్టయినప్పుడే ఆయనను కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. అయితే పోలీసులు దానికి ఒప్పుకోలేదు. దీంతో నడిరోడ్డుపై పడుకుని జనసేనాని నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ములాఖత్ అనుమతి లభించింది. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య బంధం బలపడిన విషయం తెలిసిందే. బాబు అరెస్టు అనంతరం ఆ పార్టీ ఇచ్చిన బంద్కు పవన్ మద్దతు తెలిపారు. జనసేనానిని చంద్రబాబు దత్తపుత్రుడంటూ అధికార వైసీపీ తరచూ విమర్షిస్తూ వస్తున్నది.