Pawan Kalyan | ఏదో ఒక రోజు జనసేన ( Janasena ) జాతీయ పార్టీగా మారుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కార్యకర్తలు అండగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సేనతో సేనాని’ పేరుతో విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. మండల స్థాయి నుంచి కమిటీలను తానే స్వయంగా సమన్వయం చేస్తానని తెలిపారు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని విస్తరించాలని అంటున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను పార్టీని విస్తరించాలంటే ముందు మీరు పోరాటం చేయండని పిలుపునిచ్చారు. మీకు అండగా సైద్ధాంతిక బలం ఇస్తానని.. మీరు బలోపేతం చేస్తే కచ్చితంగా ఒకరోజున జనసేన జాతీయ పార్టీగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన జాతీయ పార్టీ అవుతుందని ఈరోజు అంటే అది హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ.. ప్రజలందరూ కలిసి వస్తే అది కచ్చితంగా సాధ్యమవుతుందని తెలిపారు. తాను ఒక కులం కోసం ఆలోచించి ఉంటే.. ఆ కుల నాయకుడిని అయ్యేవాడినని.. కానీ ప్రజా నాయకుడిని అవ్వాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు.
సేనతో సేనానిలో మాట్లాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
దిగువ స్థాయి కార్యకర్తలకు నాయకులను తయారు చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. 2029 నాటికి బలమైన నాయకులను తయారుచేస్తామని చెప్పారు. వీర మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేస్తామని, క్రమశిక్షణ కలిగిన వారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, భవిష్యత్ తరాలకు బలమైన నాయకత్వం, నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారికి భద్రత అనే మూడు అంశాల ప్రాతిపదికన ‘ త్రిశూల వ్యూహం’ రూపొందిస్తామని తెలిపారు. దసరా తర్వాత నుంచి అమలు చేసేలా పకడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. త్రిశూల్ ద్వారా జనసేనలో సరికొత్త అధ్యాయం మొదలువుతుందని చెప్పారు.