Pantham Nanaji | అధికార దర్పంతో ఏపీలో ఓ జనసేన ఎమ్మెల్యే రెచ్చిపోయారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్, ఫొరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి దిగారు. బూతులతో రెచ్చిపోయారు. ‘ ఏరా లం.. కొడకా.. చంపేస్తాను నా కొడకా.. ఏంటి రా నన్ను తిట్టావంట.. నన్ను తిట్టాల్సిన పనేంటి నీకు.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొడతావురా’ అంటూ బండబూతులు తిట్టడమే కాకుండా తన అనుచరులతో కలిసి పిడిగుద్దులతో దాడి చేశారు. శనివారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కాకినాడ రంగరాయ వైద్యకాలేజీకి శ్రీనగర్‌లో 12 ఎకరాల క్రీడా మైదానం ఉంది. ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్ కోర్టు ఉంది. మెడికల్ కాలేజీ పర్మిషన్ లేకుండా బయటవాళ్లు ఈ గ్రౌండ్‌ను వినియోగించుకునేందుకు వీల్లేదు. కానీ కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అనుచరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్ కోర్టుకు వస్తున్నారు. అక్కడి మెడికోలతో గొడవకు దిగుతున్నారు. అలాగే వైద్య విద్యార్థినులతో పాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. అలాగే మెడికల్ కాలేజీ యాజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు కాలేజీ గ్రౌండ్లోకి కొంతమంది బయట వ్యక్తులు వచ్చి వైద్య విద్యార్థులతో కవ్వింపు చర్యలకు దిగారు. ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్దన్, వైద్యులు, విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఈ డాక్టర్లు మిమ్మల్ని నోటికొచ్చినట్లు తిడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం రాత్రి ఆయన మైదానానికి వెళ్లి డాక్టర్ ఉమామహేశ్వరరావును అసభ్యపదజాలంతో దూషించారు. ఆయనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న మెడికల్ కాలేజీ యాజమాన్యం.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.