Harihara Veeramallu | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాను సక్సెస్ చేసేందుకు జనసేన నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాను బ్లాక్‌బస్టర్ చేసేందుకు ఒకటికి రెండుసార్లు మనమే సినిమా చూడాలని జన సైనికులకు నాయకులు సూచిస్తున్నారు. మళ్లీ మళ్లీ చూడటమే కాకుండా డబ్బులు లేని వాళ్లకు టికెట్లు కొనిచ్చి వాళ్లకు కూడా సినిమా చూపించాలని చెబుతున్నారు. ఈ మేరకు జనసేన ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, కార్యకర్తలతో సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, కందుల దుర్గేశ్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలని ప్రత్యర్థులు ఆలోచిస్తూనే ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాపై కూడా వైసీపీ వాళ్లు ఫేక్ ప్రచారం చేసి.. పవన్ కల్యాణ్ ఇమేజ్ను తగ్గించాలని చూస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ ఇమేజ్ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. “పవన్ కల్యాణ్ సినిమాపై కావాలని నెగిటివిటీ పెంచుతున్నారు.. దాన్ని తగ్గించేందుకు పవన్ కల్యాణ్ ఒంటరిపోరాటం చేస్తున్నారు. అందుకే కెరీర్లోనే తొలిసారిగా సక్సెస్ మీట్లో పాల్గొంటున్నారు. ఆయనకు మనం అండగా ఉండాలి.” అని అన్నారు. ” ఆర్థికంగా పార్టీని నిలబెట్టేందుకు పవన్ కల్యాణ్ ఎంతో కృషి చేశారు. సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్ ను రాజకీయాల్లో ఉపయోగించారు. ఆయన కష్టం వృథా కాకుండా ఈ సినిమాను కాపాడేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేయాలి. ఇది మనం నైతికంగా చేస్తున్న పోరాటం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు కూడా కూటమి నాయకులను ఇన్వాల్వ్ చేయాలి.” అని సూచించారు.
డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనండి.. దయచేసి మన హీరో పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలకు, జన సైనికులను విజ్ఞప్తి చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
సినిమా పాజిటివ్ టాక్ కోసం కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలి
ప్రతి ఒక్క జనసేన కార్యకర్త హరిహర… pic.twitter.com/Hr9uhO8uSE
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2025
ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు హరిహర వీరమల్లు సినిమా చూడాలని ఎమ్మెల్సీ వరప్రసాద్ సూచించారు. సినిమాకు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని.. పాజిటివ్ టాక్ వచ్చేలా కృషి చేయాలన్నారు. ఇందుకోసం థియేటర్లకు వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు ఆరా తీయాలని సూచించారు. సినిమాకు జనాలు వస్తున్నారా? లేదా? తగ్గితే కారణం ఏంటనేది తెలుసుకోవాలన్నారు. మరో వారం రోజుల పాటు సినిమాను ఆదుకోవాలని కోరారు. ఇందుకోసం మనమే ఒకటికి రెండుసార్లు సినిమా చూడాలన్నారు. సినిమా చూసే శక్తి లేని వాళ్లకు సినిమా చూపించేందుకు నడము కట్టాలన్నారు. టికెట్లు కొనిచ్చి ప్రతి ఒక్కరికీ హరిహర వీరమల్లు సినిమా చూపించాలని కోరారు. మనతో పాటు చాలామంది సినిమా చూసేలా చేయాలని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఈ సమయంలో ఇది మనకు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. సినిమా బాగుందనే మౌత్ పబ్లిసిటీ పెంచాలని కోరారు. దీనికోసం తన పరిధిలో తాను కూడా ఏదైనా చేస్తానని చెప్పారు.