Nagababu | మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి అందని ద్రాక్షలాగే మారిపోయింది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించి.. ఇవాల్టికి ఏడాది పూర్తయ్యింది. కానీ దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. సరిగ్గా ఏడాది క్రితం అంటే.. 09-12-2024న టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో మూడు రాజ్యసభ స్థానాలకు టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు , సాన సతీశ్, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక జనసేన నుంచి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ విడుదల చేసి ఏడాది అవుతున్నప్పటికీ.. నాగబాబు మంత్రి పదవి మాత్రం ఆచరణలోకి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. వైసీపీని ఓడించేందుకు మిగిలిన ప్రధాన పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలో జనసేన పార్టీలో నాగబాబు కీలకంగా వ్యవహరించారు. తమ్ముడి సక్సెస్ కోసం ఎన్నో త్యాగాలను చేశాడు. 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచి నాగబాబు పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ కూటమి పొత్తు నేపథ్యంలో ఆ సీటును వదిలేసుకున్నాడు. అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ.. చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకున్నా అది కుదరలేదు. దీంతో నాగబాబును రాజ్యసభకు పంపించాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. కానీ అది కూడా కుదరలేదు.
గత ఏడాది ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండటంతో టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య, జనసేన నుంచి నాగబాబును నామినేట్ చేయాలని ముందుగా భావించారు. కానీ అనూహ్యంగా లోకేశ్ సన్నిహితుడైన సాన సతీశ్ ఫీల్డ్‌లోకి వచ్చాడు. ఫైనల్ జాబితాలో నాగబాబు పేరు తొలగించి టీడీపీ నుంచి సాన సతీశ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్‌ను కూల్ చేసేందుకు నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకుని మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే 09-12-204న చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. దీని ప్రకారం నాగబాబును ఎమ్మెల్సీని చేసి మంత్రిమండలికి అయితే పంపించాడు కానీ.. మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు.
ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఒక్క ఖాళీ ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేయాలని అనుకున్నప్పటికీ.. పవన్ కల్యాణే పునరాలోచనలో పడినట్లు జనసేనవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మంత్రి పదవుల్లో ఉన్నారు. వీరిలో పవన్, కందుల దుర్గేశ్ ఇద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారే అవుతారని.. ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనే ఉద్దేశంతో పవన్ కల్యాణే వెనుకాడుతున్నట్లు సమాచారం.

Nagababu