Naga babu | ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల అన్నారు. విజయవాడలో నాగబాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్‌కు తగిన పదవులు, శాఖలు వచ్చాయని తెలిపారు. సరైన వ్యక్తికి సరైన పదవి ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తుంటే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లు కనబడుతున్నాయని తెలిపారు. సొసైటీలో చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం బాధ్యతలు తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగానూ పవన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఉపాధిహామీని ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన దస్త్రాలపై ఆయన తొలి సంతకం చేశారు.