వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి వివాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. వైఎస్ కుటుంబంలో ఆస్తుల కోసం తగాదాలు పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని అన్నారు. ఈ ఆస్తి వివాదం పరిష్కారం కావాలంటే వైఎస్ విజయమ్మనే ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. వేరే వాళ్లు దీనిలో జోక్యం చేసుకోవద్దని కోరారు.
హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తి వివాదాలు తలెత్తడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తొందరగా పరిష్కారం చూపాలని విజయమ్మను కోరారు. జగన్‌కు, షర్మిలకు న్యాయం చేయాలని ఆమెను విజ్ఞప్తి చేశారు. మీ ఇంట్లో రచ్చ చేసుకుంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబంధం ఏం సంబంధమని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
వైసీపీలో ఉండి ఆస్తులు సంపాదించుకుని తర్వాత పార్టీ మారారని తనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఆస్తులు పోగొట్టుకున్నా తప్ప.. సంపాదించుకోలేదని చెప్పారు. తన కుమారుడి సాక్షిగా ఈ విషయం చెబుతున్నానని అన్నారు. అప్పులైతే నా తండ్రి, కోడలి ఆస్తి అమ్మి తీర్చానని పేర్కొన్నారు. ఇదీ జగన్‌కు తెలుసని అన్నారు.