Ambati Rambabu | టీడీపీ-జనసేనపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని.. సినిమా డైలాగులు చెప్పేందుకే పనికొస్తాడని విమర్శించారు. తాడేపల్లిలో శనివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కాపులు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అయితే కాస్తో కూస్తో ఆలోచిద్దామని అనుకున్నారని అన్నారు. టీడీపీ-జనసేన పొత్తుతో కాపుల్లో నిరాశ అలుముకుందని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ సీఎం రేసులో లేకపోవడంతో జనసేనను వదిలి చాలామంది నేతలు వైసీపీలో చేరుతున్నారని తెలిపారు. చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరడమే అందుకు నిదర్శనమని వివరించారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన సభతో జెండా ఎత్తేశారని విమర్శించారు. రెండు పార్టీలు కలిసినా వైసీపీని ఎదురించలేవని స్పష్టం చేశారు. మూడు సిద్ధం సభలు చూసి టీడీపీ, జనసేన చల్లబడ్డాయని ఎద్దేవా చేశారు. ఈ నెల 10న జరిగే నాలుగో సభతో విపక్షాల రాజకీయానికి ముగింపే అని స్పష్టం చేశారు.