Pawan Kalyan | జనసేన ప్రారంభించి పుష్కర కాలం కావస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ 12 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో కుటుంబానికి సమయం కేటాయించలేకపోయానని.. సినిమాలపై కూడా ఫోకస్ చేయలేకపోయానని పేర్కొన్నారు. అయినప్పటికీ సమాజం, దేశంపై ఏనాడూ ప్రేమ తగ్గలేదని స్పష్టం చేశారు.
విశాఖపట్నం వేదికగా శనివారం సాయంత్రం జరిగిన వేదికగా “సేనతో సేనాని” జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సగటు మనిషి కోపం, ఆవేశం, ఆక్రోశాల నుంచే జనసేన పార్టీ పురుడుపోసుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ ఏర్పడి వచ్చే ఏడాది మార్చి 14నాటికి పుష్కర కాలం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. కుటుంబానికి కూడా సమయం కేటాయించలేకపోయానని.. సినిమాలపై దృష్టి సారించలేకపోయానని తెలిపారు. కానీ సమాజం, దేశంపై ఏనాడూ ప్రేమ తగ్గలేదన్నారు. దాని ఫలితంగానే దేశ రాజకీయ చరిత్ర ఎవరూ సాధించలేని విధంగా 100 శాతం స్ట్రైక్ రేట్ తో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. 2014లో 150 మందితో మొదలైన జనసేన పార్టీ ప్రయాణం నేడు 12 లక్షల పైచిలుకు క్రియాశీల కార్యకర్తలకు చేరిందని తెలిపారు. జనసేన పార్టీ భావజాలాన్ని నమ్మి తనతో పాటు దశాబ్ద కాలపాటు ప్రయాణం చేసిన జన సైనికులు, వీరమహిళలే రియల్ హీరోస్ అని పవన్ కల్యాణ్ తెలిపారు. వాళ్ల పోరాటం ఫలితంగానే 21 మంది శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధించామని తెలిపారు.
పోరాటాల పురుటిగడ్డ తెలంగాణలో జనసేన పార్టీ ప్రయాణం ప్రారంభమైందని.. ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. పార్టీ ప్రారంభించిన మొదటి రోజు ఏ ఉద్వేగంతో ఉన్నానో… ఈ రోజుకు అదే ఉద్వేగంతో ఉన్నాని తెలిపారు. దశాబ్దకాల ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయని గుర్తుచేసుకున్నారు. తగిలిన ప్రతి దెబ్బకు రాటుదేలాను తప్ప విశ్వాసం కోల్పోలేదని, నడక తడబడలేదని చెప్పారు. తగిలిన ప్రతి దెబ్బ నన్ను మరింత బలవంతుడిని చేసిందని అన్నారు. ఈ ప్రయాణంలో నాతో పాటు నిలబడిన మీరంతా అన్ సంగ్ హీరోసే అని కొనియాడారు. నిజాయతీతో భవిష్యత్తు గమనాన్నే మార్చొచ్చు అని మీరంతా నిరూపించారని అన్నారు. యుద్ధరంగంలో కాలం, సహనమే బలమైన ఆయుధాలు. అలాంటి సహనాన్ని గుండెల్లో పెట్టుకున్న రియల్ హీరోస్ జన సైనికులు, వీర మహిళలు అని స్పష్టం చేశారు.
‘ జనసేన పార్టీ జాతి ఆశలను ముందుకు తీసుకెళ్లే పార్టీ. ఈ పార్టీ గురించి ఒక రోజు దేశమంతా మాట్లాడుకోవాలని కలలు కన్నాను. అది నిజమైనందుకు గర్వపడుతున్నాను. బంగారం లాంటి భవిష్యత్తు వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానని నాకు ఏనాడు అనిపించలేదు. ఉద్ధానం కిడ్నీ బాధితులకు అండగా నిలబడినప్పుడు, గిరి శిఖర గ్రామాలకు రోడ్లు వేస్తున్నప్పుడు వారి కళ్లల్లో ఆనందం చూసి నా నిర్ణయం సరైనదే అనిపించింది. జనసేన పార్టీ ఉనికి లేకపోయినా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి మేము కూడా జనసేనలో భాగస్వాములు అవుతాం అని అడుగుతున్నారు. వారందరికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను.’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
‘ సరైన రాజకీయ వ్యూహం లేకుండా సిద్ధాంత బలం మాత్రమే మాట్లాడి అడవుల్లో హతమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. రాజకీయాల్లో సిద్ధాంత బలంతోపాటు వాటిని సంపూర్ణంగా నమ్మి అమలు చేసే శక్తి ఉండాలి. అప్పుడే కోరుకున్న మార్పు వస్తుంది. జనసేన పార్టీ ఏడు మూల సిద్ధాంతాలను ప్రతిపాదించినప్పుడు చాలా మంది అవహేళనగా మాట్లాడారు. నిలకడలేని రాజకీయాలు అంటూ అపహాస్యం చేశారు.’ అని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆ రోజు నన్ను నిజంగా నమ్మింది జనసైనికులు, వీరమహిళలే అని తెలిపారు. ఆనాడు కమ్యూనిజం అంటూ మాట్లాడిన సోవియట్ రష్యా.. డెమోక్రటిక్ దేశంగా మారిందని.. మావోయిజం అని మాట్లాడిన చైనా క్యాపిటలిజంలోకి వచ్చిందని.. కఠినమైన నిబంధనలు పాటించే సౌదీ అరేబియా ఆడవాళ్లకు ఓటు హక్కు కల్పించిందని చెప్పారు. ప్రపంచమే క్రమక్రమంగా మారుతోందని.. కాలంతోపాటు మార్పులు అనివార్యమని అన్నారు. కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటిలిజం ఇలా అన్ని సిద్ధాంతాలపై అవగాహన పెంచుకున్న తరువాతే పార్టీ పెట్టానని తెలిపారు. సినిమాల్లో నటించినంత మాత్రాన అవగాహన లేదని అనుకోవద్దని అన్నారు. ప్రతి సిద్ధాంతంపై సంపూర్ణ అవగాహనతోనే మాట్లాడతానని తెలిపారు. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకు నేను దశాబ్ద కాలంపాటు నలిగి నిలబడ్డాను కాబట్టే 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని.. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడానికి తుపాకులే పట్టుకోనక్కరలేదు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో మనం పట్టుకున్న పార్టీ జెండానే ఆయుధంగా మారుతుంది. మన మాటే తూటా అవుతుందని చెప్పారు.