అమరావతి : సదాశయంతో కూటమిని ఏకం చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan kalyan) కల త్వరలో నెరవేరబోతుందని మాజీ మంత్రి, జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna) పేర్కొన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఆశించిన ఫలితాలు రాబోతుందని అన్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోబోతున్నామని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్(YSR) మొదలు పెట్టిన ప్రాజెక్టులను కనీసం కొడుకుగా వైఎస్ జగన్ పూర్తి చేయలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పోలవరం పెండింగ్ లోనే ఉంది. నిర్వాసితులకు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు (Irrigation Projects) పూర్తిగా పెండింగ్‌లో ఉండడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువగా వలసలున్నాయని తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఎకరాకు నీరు రావాలని అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇవ్వాలని కోరబోతున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన సమయంలో కంటే వైఎస్ జగన్ పాలనలో వంద రేట్లు నష్టపోయామని కొణతాల ఆరోపించారు.