AP News | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోపై ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో వాడీవేడీ జరిగింది. కౌన్సిల్ హాలులో పవన్ కల్యాణ్ ఫొటో ఎందుకు పెట్టలేదని వైసీపీ కౌన్సిలర్ నిలదీశారు. దీంతో ఆయనపై టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగ్గయ్యపేట కౌన్సిల్ హాలులో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోను తీసేసి, చంద్రబాబు నాయుడు ఫొటోను ఏర్పాటు చేశారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను మాత్రం పెట్టలేదు. దీనిపైనే ఇవాళ జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ మనోహర్ ప్రశ్న లేవనెత్తాడు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ ఫొటో ఎప్పుడు ఏర్పాటు చేయాలో మేం చూసుకుంటాం.. మీకెందుకు అని వైసీపీ కౌన్సిలర్‌పై టీడీపీ కౌన్సిలర్లు ఎదురుదాడికి దిగారు. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. సమావేశం రసాభాసగా మారుతుండటంతో మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర మధ్యలోకి వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం ఫొటోలను ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇరు పక్షాల నేతలు సైలెంట్ అయ్యారు.