అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకనోవడంతో విద్యార్థులు చదువులు మానేసుకుంటున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan ) ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆదివారం ట్విటర్లో (Twitter) ఆరోపించారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.
చంద్రబాబు(Chandrababu) పాలనలో అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోందని, ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో తీసుకొచ్చిన విద్యా పథకాలన్నింటినీ రద్దుచేసి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారని ఆరోపించారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారని విమర్శించారు.
తమ పాలనలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లమని, గత విద్యాసంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకూ రూ. 12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు.
ప్రభుత్వం తీరుచూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి, కాళ్లేమో గడపకూడా దాటడం లేదని వ్యాఖ్యనించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములకు పాల్పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదలచేయాలని డిమాండ్ చేశారు. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు.