విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో ముఖ్యమంత్రి జగన్ కీలుబొమ్మగా మారారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. జగన్ తన పదవి గురించి ఆందోళన చెందుతున్నారే గానీ రాష్ట్ర ప్రజల గురించి మాత్రం కాదన్నారు. శైలజానాథ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. వరద బాధితులను ప్రభుత్వం విస్మరించిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం ఆదేశాలు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికీ వెళ్లలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని దుయ్యబట్టారు.
సీఎం జగన్ ప్రధాని మోదీ పూజలు చేయడం మాని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకోవడంపై దృష్టి సారించాలని శైలజానాథ్ సూచించారు. వరద బాధితులు టెంట్లలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు రూ.25 వేలు వెంటనే అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల ప్యాకేజీ ఇస్తామని జగన్ గతంలో ఇచ్చిన హామీని శైలజానాథ్ గుర్తు చేశారు. సీఎం తానిచ్చిన హామీని వెంటనే నెరవేర్చేలా చూడాలని ఆయన జగన్కు విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అందించిన నోటీసును ప్రస్తావిస్తూ.. గురు, శుక్రవారాల్లో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఈడీకి వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. గాంధీ కుటుంబంపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం తప్ప ఇది మరొకటి కాదన్నారు.