అమరావతి : సినినటుడు అల్లు అర్జున్ అరెస్టుపై (Allu Arjun Arrest) బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ,ఎంపీ పురందేశ్వరి (Purandeshwari) స్పందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్‌కు వెళ్లారని పేర్కొన్నారు. కేసులో మిగిలిన వారిని అరెస్టు చేయకుండా ఏ11 ఉన్న అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం సరికాదని వెల్లడించారు.
పుష్ప -2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్లో స్పెషల్ బెనిఫిట్ షోను (Benfit Show) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కుటుంబం ఈ షోను తిలకించేందుకు అక్కడికి వెళ్లింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఒక మహిళ ఊపిరి ఆడక చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన తెలంగాణ సర్కార్ సినిమా థియేటర్ యజమానులతో పాటు సినీ హీరో అల్లు అర్జున్‌పై ఏ 11గా కేసు నమోదు చేసి గత శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
అయితే హైకోర్టు వెంటనే బెయిల్ ఇవ్వగా సంబంధిత పత్రాలు సకాలంలో జైలు అధికారులకు అందక అల్లు అర్జున్ మరుసటి రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఘటనపై శనివారం జరిగిన అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డికి సినీ ఇండస్ట్రీని ఘాటుగానే హెచ్చరించారు.