అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ గురువారం చర్చించే అవకాశముంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న 13 సంఘాల ప్రతినిధులు అందుబాటులో ఉండాలని, ఏ సమయంలోనైనా తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీకి అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి ఉద్యో సంఘాల ప్రతినిధులకు సమాచారం అందింది. ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చల్లో పీఆర్సీతో పాటు ఫిట్ మెంట్‌ను, తదితర 71 ఉద్యోగ సమస్యలపై చర్చించి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌పై అధికారుల కమిటీ సూచించిన 14.29 శాతం కంటే ఎంత ఎక్కువ ఇస్తే ప్రభుత్వం ఎంత భారం పడుతుందో ఆర్థిక శాఖ నివేదికలు సిద్ధం చేసి సీఎం జగన్‌కు సమర్పించింది. నిన్న ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ , ఇతర అధికారులు సీఎంకు నివేదికను సమర్పించారు. వీటిపై జగన్ అధికారులతో చర్చించారు. అయితే నివేదికపై గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.