అమరావతి : ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ ఎఫ్ 15 ( GSLV F15 ) రాకెట్ విజయవంతంగా ప్రయోగించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ఇస్రో వందో ప్రయోగం దేశానికి ఓ చరిత్రాత్మక మైలురాయిగా (Milestone) మిగిలిపోతుందని అభివర్ణించారు. వంద మిషన్లలో 90శాతం కంటే ఎక్కువ విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను, ఇంజినీర్లను అభినందనలు తెలిపారు.
GSLV F-15 రాకెట్ రెండవ లాంఛ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోయింది. ఇస్రో అభివృద్ధి చేసిన నావిగేషన్ ఉపగ్రహాన్ని రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. భూమికి 36 వేల కి.మీ ఎత్తున జీటీవోఆర్బిట్లో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. డాక్టర్ నారాయణన్ ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక మొదటి ప్రయోగం విజయవంతమైంది.