అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బరితెగింపునకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) మండిపడ్డారు. మేనిఫెస్టోను (Manifesto) చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని సుదీర్ఘంగా ట్విటర్లో ( Twitter) ఓ లేఖను విడుదల చేశారు. లక్షలాధి మంది రైతులను, తల్లులకు, పిల్లలకు ద్రోహం తలపెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి . కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం,పచ్చి దగా ఏమైనా ఉంటుందా?నని నిలదీశారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయని అన్నారు.
చెత్తబుట్టలో మేనిఫెస్టో
వైసీపీ (YCP) హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను అందించి, విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేశారని పేర్కొన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా తీరు కూడా అలానే ఉందని ఆరోపించారు.
ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని విమర్శించారు. ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదని అన్నారు. కేంద్రం ఇచ్చేది కాకుండా ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీకూడా అయిపోయింది. ఒక్కపైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్లు పెట్టుకున్నా, ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? అంటు ప్రశ్నించారు.
రైతులకు పెట్టుబడి సహాయం లేదు
రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు. ఆర్బీకేలను నిర్వీర్యంచేశారని ఆరోపించారు. తల్లికి వందనం , రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి మహిళకూ రూ.18వేలు , నిరుద్యోగభృతి ఎందుకివ్వడం లేదని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు.
ప్రతి అడుగులోనూ స్కాంలేనని, ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదని విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైసీపీ ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.