అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్సీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను రప్పిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతోనే ఎన్నికల్లో దారుణాలకు పాల్పడుతున్నారని అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలించేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లాతో ఎటువంటి సంబంధం లేని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలసముద్రంలో మకాం వేసి ఇతర ప్రాంతాల నుంచి జనాలను ప్రత్యేక వాహనాల్లో పెనుకొండకు తరలించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెనుకొండ పట్టణానికి బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా కట్టడి చేసి, ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.