అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబీకులు సరస్వతి సిమెంట్ కంపెనీ (Saraswati lands) పేరుతో ఆక్రమించుకున్న భూములపై విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మాచవరం, వేమవరం,చెన్నాయపాలెంలో మంగళవారం సరస్వతి భూములను పరిశీలించారు. దాదాపు అరగంట పాటు భూములు పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడారు.
సరస్వతి కంపెనీకి భూములు ఇవ్వబోమన్న వారిపై పెట్రోలు బాంబులు వేసి భయపెట్టి భూములు లాక్కున్నారని ఆరోపించారు. అటవీ భూములను ఆక్రమించుకున్నారని, దళితుల భూములను ఇష్టారాజ్యంగా లాక్కున్నారని పేర్కొన్నారు, చెరువులు, కుంటలను సైతం రెవెన్యూ భూములుగా చిత్రీకరించి వాటిని స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. రైతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కొనుగోలు చేసిన భూములకు ఇంతవరకు పరిహారం ఎందుకు అందించలేదని ప్రశ్నించారు.
సిమెంట్ కంపెనీకి పర్యావరణ అనుమతులు కూడా లేవని ,30 సంవత్సరాలు లీజును సీఎం జగన్ అయ్యాక 50 సంవత్సరాలకు మార్చుకున్నారని దుయ్యబట్టారు. కట్టని సిమెంట్ కంపెనీకి 198 కోట్ల లీటర్ల కృష్ణ జలాలు మళ్లింపు కోసం రాసుకున్నారని ఆరోపించారు. సిమెంట్ కంపెనీని ఎందుకు చేపట్టలేదని, పరిహారం ఎందుకు అందించలేదు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉండేందుకు వచ్చామని తెలిపారు. రైతులను బెదిరించిన వారిపై పోలీసులు ఉపేక్షించవద్ధని అన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వేధించి చంపారని విమర్శించారు.