అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండటంతో మనస్తాపం చెందిన ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మార్తాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
తల్లిదండ్రులు పెళ్లి చూస్తుండటంతో కీర్తన తనకు పెళ్లి ఇష్టం లేదని తెలిపింది. వారి తల్లిదండ్రులు బాలికకు ఇప్పుడే పెళ్లి చేయమని ఒక వేళ మంచి సంబంధం వస్తే ఆలోచిస్తామని సర్ది చెప్పారు. అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న గడ్డిమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ కీర్తన మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.