చిత్తూరు జిల్లా : ఒంటరిగా రెక్కీ నిర్వహిస్తాడు.. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా ఎంచుకుంటాడు.. అర్ధరాత్రి వచ్చి నిమిషాల్లో చోరీ చేసి పరారవుతాడు. ఈ దొంగ కన్ను పడిందంటే.. ఆ ఇంట్లోని నగలు మాయం కావాల్సిందే. అంతటి మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి దాదాపు అర్ధకిలో బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు రూరల్, కార్వేటి నగరం పోలీసులతో కలిసి చిత్తూరు టౌన్ పోలీసులు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఇళ్లల్లో దొంగతనాలకు అలవాటు పడిన అంతర్రాష్ట్ర దొంగను బుధవారం అరెస్టు చేశారు. పలు చైన్ స్నాచింగ్‌లకు కూడా పాల్పడ్డట్లు ఇతడిపై కేసులు ఉన్నాయి. ఈ అంతర్రాష్ట్ర దొంగను గుంటూరు పట్టణంలోని సీతానగర్‌కు చెందిన తిరువీదుల మహేశ్ (33) గా గుర్తించారు. తన విలాసవంతమైన ఖర్చులు, విపరీతమైన అలావాట్ల కోసం ఇళ్లల్లో దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.
రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులు విశ్వసనీయ సమచారం అందుకున్నారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి అరెస్ట్ చేశారు. అతడి నుంచి 450 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాల్లో 150 ఇళ్లల్లో జరిగిన చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ కేసుల్లో పలుమార్లు అరెస్టై జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఇదే తరహా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దొంగతనం చేయడానికి ముందు ఒంటరిగా తాళం వేసి ఉన్న ఇళ్లలో రెక్కీ నిర్వహిస్తాడు.
ప్రకాశం జిల్లాలో నాలుగు, గుంటూరు రూరల్‌లో 9, కృష్ణా జిల్లాలో ఒకటి, కర్నూలులో 2, విజయవాడ అర్బన్‌లో 4, గుంటూరు అర్బన్‌లో 4, అనంతపురంలో 2, తిరుపతి అర్బన్‌లో 1, నెల్లూరులో 11 ప్రాంతాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో 3, సిద్దిపేటలో 8, ఖమ్మంలో మూడు, సంగారెడ్డి జిల్లాల్లో 2 ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.