అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (Inter Exams ) శనివారం నుంచి పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల పరీక్షలు జరుగగా తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై ( Second Language ) పరీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకుగాను రాష్ట్రవాప్తంగా ఉన్నత విద్యాశాఖ 1,500 పరీక్షా కేంద్రాలను ( Exams Centres ) నెలకొల్పింది. ఈ పరీక్షలకు 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు.
ఈ పరీక్షలకు నిమిషం నిబంధనను అమలు చేశారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించ వద్దని ఆదేశాలను పరీక్ష కేంద్రాల అధికారులు అమలు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ( CC Cameras ) ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలకు నో మొబైల్ జోన్‌గా ప్రకటించారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు తమ బెస్ట్ ఇవ్వాలన్నారు. ఫోకస్ చెదరకుండా చూసుకోవాలన్నారు. తమ ప్రతిభ మీద తాము నమ్మకం ఉంచాలని సూచించారు. పరీక్షల్లో అనవసర ఒత్తడికి గురికావొద్దని కోరారు.