తిరుమల : శ్రీ కలియుగ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 54,469 మంది భక్తులు దర్శించుకోగా 25,484 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.85 కోట్లు వచ్చిందని వివరించారు.
రేపు రథోత్సవం
తిరుపతిలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 5 .30 గంటలకు స్వామివారు రథారోహణం, ఉదయం 7.10 నుంచి 8.30 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తారని తెలిపారు.