అమరావతి : దక్షిణ మధ్య రైల్వే (South Central Railway ) పరిధిలో సుమారు రూ.21 వేల కోట్లతో వివిధ రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్(GM Arunkumar Jain) వెల్లడించారు. శుక్రవారం విజయవాడలోని రైల్వే ఈటీటీసీ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశాన్ని నిర్వహించారు.
రాజధాని అమరావతి (Amaravati) కోసం కొత్తగా రైల్వేలైను సర్వే పూర్తయ్యిందని వెల్లడించారు. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మీదుగా కొత్త రైల్వేలైనుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపి, నిధులు కేటాయించగానే కొత్త రైల్వే లైను (New Railway Line) పనులు ప్రారంభిస్తామని వివరించారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని అన్నారు.
2024-25 రైల్వేబడ్జెట్‌లో ఏపీకి రూ. 9,154 కోట్లు మంజూరయ్యాయని జీఎం ప్రకటించారు. మచిలిపట్నం-బాపట్ల- రేపల్లె రైల్వే లైన్ కోసం ఎంపీలు ప్రతిపాదనలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు కేశినేని శివనాథ్, పంచలింగాల నాగరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.