అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మద్యం పాలసీ(Liquor policy) లో ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి(Former minister Narayanaswamy) అన్నారు. గురువారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం పాలసీలో తాను తప్పు చేసినట్లు రుజువు చేస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమేనని సవాల్ చేశారు.
ఏపీలో కొత్త బ్రాండ్లన్ని చంద్రబాబే(Chandra Babu) తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ (Super six) హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి నిధులు ఓర్చుకోలేక పోయారని అన్నారు.
పేదవారికి న్యాయం జరిగితే సహించలేక వైసీపీ పాలనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు ఆడారని ఆరోపించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కులాల కార్డును ముందుకు తీసుకువచ్చి అధికారం చేపట్టారని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య అందించాలని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.