అమరావతి : దివంగత నందమూరి తారకరామారావు ( NTR) సతీమణి లక్ష్మీపార్వతి ( Lakshmi Parvati ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ( Chandra Babu ) పై విరుచుకు పడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. మోసాలు, వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకు అలవాటేనని అన్నారు.
ఎన్టీఆర్ భారీ విగ్రహం నెలకొల్పుతామని ఇస్తున్న హామీ ప్రజలను తప్పుదోవ పట్టించ డానికేనని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నాయకులు తమ రాష్ట్రానికి చెందిన మహనీయుల కు భారత రత్న ఇప్పించేందుకు పోరాటాలు చేస్తారని, ఎన్టీఆర్ లాంటి మహనీయుడు కోసం ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని నిలదీశారు. చేతనైతే ఎన్టీఆర్కు భారత రత్న ( Bharat Ratna ) అవార్డు ఇచ్చేందుకు కేంద్రం వద్ద పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ అంటే ఏ మాత్రం ప్రేమ, గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.
రాష్ట్రంలో హత్యలు, అరాచకాలు , దౌర్జన్యాలు చేయిస్తున్న నారా లోకేష్ వైసీపీ అధికారం లోకి రాగానే మొట్టమొదట అరెస్టు అవుతాడని కూటమి అరాచకాలపై ఎంక్వయిరీ కమిషన్ వేయించి అరెస్టు చేసి జైలులో పెడుతామని హెచ్చరించారు. నీచమైన పరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని పేర్కొన్నారు. దుర్మార్గులతో చేయి కలపడం అన్యాయమని, వారిని శిక్షించే బదులు వారికి అండగా నిలబడడం దారుణమని అన్నారు.