అమరావతి : ఏపీలోని ఆర్థిక రాజధాని విశాఖలో అక్రమ నిర్మాణాలు చేపడితే హైదరాబాద్లో మాదిరిగా హైడ్రా తరహ చర్యలు మొదలు పెడుతామని విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivas Rao) హెచ్చరించారు. మంగళవారం విశాఖపట్నం(Visaka) లోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును మంత్రి నారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అక్రమ నిర్మాణాలతో పర్యావరణానికి, ప్రజలకు అనేక విధాలుగా నష్టం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేస్తుందన్నారు. మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారని ఆరోపించారు. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని, అక్రమ నిర్మాణాలను ఆపకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రుషికొండ (Rishikonda) భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని తెలిపారు. ఈ నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నామని వెల్లడించారు. 2023లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద కేంద్రం నుంచి రూ. 450 కోట్ల నిధులు వస్తే వాటని ఇతర వాటికి మళ్లించారని దుయ్యబట్టారు.