Buddha Venkanna | టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తన కార్యాలయంలో బుద్ధా వెంకన్న భారీ కేక్ కట్‌చేశారు. అనంతరం చిన్నికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. పదవి లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నా అని చెప్పారు.
2024లో చంద్రబాబుకు రక్తంతో అభిషేకం చేసినా తనకు టికెట్ రాలేదని బుద్ధా వెంకన్న తెలిపారు. పదవి లేకపోవడంతో ఎప్పుడు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐల బదిలీ విషయంలో తన మాట చెల్లలేదని చెప్పారు. సీఐల బదిలీ విషయంలో ఎమ్మెల్యేల మాటనే నెగ్గిందని.. వాళ్లు చెప్పిన వారికి పని జరిగిందని అన్నారు. ప్రస్తుతం తాను మాత్రం ఇతరులపై ఆధారపడి ఉండాల్సి వస్తుందని బాధపడ్డారు.
వైసీపీ పాలనలో తాను అనేక పోరాటాలు చేశానని బుద్ధా వెంకన్న గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో తనపై 37 కేసులు పెట్టారని చెప్పారు. తనతో పాటు కార్యకర్తలపై కూడా కేసులు పెట్టారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు న్యాయం చేయాలంటే ఎమ్మెల్యేగా ఉండాలని ఇప్పుడు అర్థమైందని అన్నారు. 2029లో ఎలాగైనా సరే పోరాటం చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, నారా లోకేశ్ గురించి కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తానే స్పందించానని బుద్ధా వెంకన్న గుర్తుచేశారు. వల్లభనేని వంశీ చంద్రబాబును తిడితే తాను స్పందించి కౌంటరిస్తే గన్నవరంలో తనపై కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్ దాడికి వెళ్లినప్పుడు కూడా తానే స్పందించానని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారందరూ అప్పుడు ఏమయ్యారని బుద్ధా వెంకన్న నిలదీశారు. ఇదంతా తాను వ్యతిరేకతతో కాదు ఆవేదనతో అడుగుతున్నానని స్పష్టం చేశారు. తన ఆవేదనను టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీ కేశినేని చిన్నిని విజ్ఞప్తి చేశారు.