Human Trafficking | ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను వైజాగ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కిరండోల్ – విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికలను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో రైల్వే పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. బాలికలను అక్రమంగా తరలిస్తున్న నిందితుడు రవి బిసోయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11 మంది బాలికలను హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రక్షించారు.
రెస్కూ చేసిన బాలికలను ఒడిశాలోని నవరంగ్‌పూర్ ప్రాంతానికి చెందిన బాలికలుగా ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిని తమిళనాడుకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. బాలికల పేరిట నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి వారిని అక్రమంగా తరలిస్తున్నట్లు కూడా తెలిసింది. కాగా, ఇప్పటి వరకు ఈ ముఠా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నేపాల్‌లోని మారుమూల ప్రాంతాలకు చెందిన 100కి పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్లు తెలుస్తోంది.
హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రెస్క్యూ చేసిన బాలికలను ఒడిశా పోలీసులకు వైజాగ్ రైల్వే పోలీసులు అప్పగించనున్నారు. అలాగే ఈ కేసును కూడా ఒడిశా పోలీసులకు బదిలీ చేశారు.