Srisalam Dam | శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. గురువారం ఉదయం ప్రాజెక్టు నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 41,590 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 28,92 క్యూసెక్కులు వరద వస్తున్నది. అలాగే సుంకేశుల నుంచి 1,18,776 క్యుసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తున్నది. కాగా, సాయంత్రం వరకు రిజర్వాయర్కి 1,89,328 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ఈ క్రమంలో నాలుగు గేట్లను ఎత్తి 1,12,800 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమగట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా 9127 క్యూసెక్కులు, ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా మరో 96,600 క్యూసెక్కుల వరద సాగర్ వైపు పరుగులు తీస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉందని అధికారులు వివరించారు.