Srisailam | శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా వరద వస్తున్నది. క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నది. ఆదివారం జలాశయం నుంచి పది క్రస్ట్ గేట్లను 23 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి జూరాల గేట్ల ద్వారా 5,20,552 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 79,268 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 27వేల క్యూసెక్కుల కలిపి.. మొత్తం 5,93,680 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌కు చేరుతున్నది.
కుడి, ఎడమ జల విద్యుతోత్పత్తి కేంద్రాల ద్వారా 64,759 క్యూసెక్కులు, 10 గేట్లు 23 అడుగుల ఎత్తు వరకు ఎత్తివేసి 5,18,650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం మొత్తం అవుట్ ఫ్లో 5,83,409 క్యూసెక్కులు సాగర్‌కు వెళ్తోందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.70 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 202.9673 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.