Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆయనకు ఎంతమంది స్ఫూర్తి అని ప్రశ్నించారు.
తనకు చెగువేరా స్ఫూర్తి అని గతంలో పవన్ కల్యాణ్ చెప్పిన విషయాన్ని చెల్లుబోయిన వేణుగోపాల్ ఈ సందర్భంగా గుర్తించారు. నిన్నటిదాకా సనాతన ధర్మమని డ్రామా ఆడారని.. ఇప్పుడు చంద్రబాబు స్ఫూర్తి అని అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీలో చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిన మద్యం పాలసీపైనా వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవారి సంపదను సృష్టించేందుకే మద్యం పాలసీ తీసుకొచ్చారని ఆరోపించారు. మద్యం టెండర్లకు రెండు రోజులు గడువు ఎందుకు పొడిగించారని ప్రశ్నించారు. మద్యం పాలసీతో ప్రజలను తాగుబోతులను చేస్తారా అని నిలదీశారు. తమ సిండికేట్లకే టెండర్లు కేటాయించుకున్నారని విమర్శించారు.