హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా, మరో 28 మందికి తీవ్ర గాయాలైన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ మార్కాపురం జిల్లా రాయవరం పలకల క్యారీ మూల మలుపు వద్ద తెల్లవారుజామున 6.30 గంటలకు కంకరలోడుతో వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సుతోపాటు టిప్పర్‌లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ప్రమాదాన్ని గుర్తించి తేరుకొనేలోపే 14మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చూస్తుండగానే బస్సు, టిప్పర్ అగ్నికీలలకు బూడిదయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను హుటాహుటిన మార్కాపురంలోని ఓ వ్రైవేట్ దవాఖానకు తరలించారు. మృతుల్లో కనిగిరి, వింజమూరు, ఉదయగిరికి చెందిన వారు ఉన్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బాలరాజు అనే ప్రయాణికుడు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే బస్సు అద్దాలను పగులగొట్టి కొంతమందిని బయటకు పంపాడు. దీంతో బాలరాజుకు కూడా గాయాలయ్యాయి. అతడిని మార్కాపురం ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలరాజు బస్సు అద్దాలు పగులగొట్టకపోతే మరికొంత మంది అగ్నికి ఆహుతి అయ్యేవారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఇదే బస్సులో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ నుంచి బయల్దేరిన ఐదుగురిలో తమ్మిశెట్టి పిచ్చమ్మ (75), తమ్మిశెట్టి రుక్మిణి (20), కంతి జయరాములు (50) మృతిచెందగా, తమ్మిశెట్టి తిరుపాల్, కంచుపాటి అయ్యన్న తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా ఏపీలోని మార్కాపురం జిల్లా నుంచి వచ్చిన ఉప్పు మాల్యాద్రి, పోలయ్య జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో స్థిరపడ్డారు. గురువారం మల్యాద్రి భార్య రమాదేవి, కుమారుడు మనోహర్‌తో.. పోలయ్య భార్య రత్నమ్మ, తమ్ముడు ముత్తంగి వెంకటేశ్పాటు మరో వ్యక్తి కిరణ్‌తో కలిసి బస్సులో బయల్దేరాడు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో ఉప్పు రమాదేవి (48), ముత్తంగి వెంకటేశ్ (42) సజీవ దహనమయ్యారు. మనోహర్ ప్రమాదం నుంచి బయటపడగా, రత్నమ్మ, కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ రోడ్డు ప్రమాదంలో అంబటి అనిల్, అతడి కుమారుడు (5నెలలు), బండారు పద్మ, ముత్తంగి వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి, ఉప్పు రమాదేవి, పొదిరి మహేంద్ర, ఎన్ ప్రభావతి, కంతి జయరాములు, ఆత్మకూరు చిన్ని, దేవేంద్ర రామయ్య, చైత్ర, జ్యోతి మృత్యువాతపడ్డారు
మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్రం ప్రకటించగా, మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించింది. ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నది.