తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో విశేషపూజహోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా నవంబరు 8 నుంచి10వ తేదీ వరకు శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, నవంబరు 10న శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. నవంబరు 11న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 12న శ్రీ నవగ్రహ హోమం, నవంబరు 13 నుంచి 21వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం), నవంబరు 22 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం(రుద్రయాగం), డిసెంబరు 2న శ్రీ శివపార్వతుల కల్యాణం చేపడతారు. డిసెంబరు 3న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, డిసెంబరు 4న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల ఆరాధన నిర్వహిస్తారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ హోమ మహోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.