(APSRTC Bus fares) విజయవాడ: సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులను నిలువు దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. పండగ వేళ సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రజల కోరికను ఆసరగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు చార్జీల మోత మోగిస్తున్నారు. టికెట్ల ధరలను మూడు రెట్లు పెంచి విక్రయిస్తున్నారు. దాంతో నలుగురైదుగురు సభ్యులున్న కుటుంబం సొంతూరికి వెళ్లాలంటే జేబులకు చిల్లులు పడటం ఖాయం. ఇప్పటికే సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో అన్ని రైళ్లలో బెర్తులు, సీట్లు నిండిపోయాయి. విజయవాడ నుంచి విశాఖ, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లలో రద్దీ అధికంగా ఉన్నది. పండగకు వెళ్లేప్పుడే కాకుండా తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రయాణానికి కష్టం తప్పేలా లేదు. తిరుగుప్రయాణమయ్యే 16, 17 తేదీల్లో రైళ్లు, బస్సులు ఇప్పటికే నిండిపోయాయి. సెలవులు ముగిసే సమయానికి తిరుగుప్రయాణం చేయడానికి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. దాంతో బస్సుల్లో రద్దీ మొదలవుతుంది. ఈ నెల 12, 13 తేదీల్లో బస్సుల్లో అత్యధిక రద్దీ ఉంటుంది. ఈ రోజుల్లోనే సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో బస్సులు, రైళ్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదునుగా ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచేశారు. విజయవాడ నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే బస్సుల్లో ఛార్జీల మోత మరీ ఎక్కువగా ఉన్నది. రెగ్యులర్ బస్సులు కాకుండా ప్రత్యేకంగా నడిపే బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. పండగకు సొంతూళ్లకు వెళ్లడం మాటేమోగానీ జేబులు ఖాళీ అవుతున్నాయంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.