Srisailam | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో జరుగనున్న ఉగాది బ్రహ్మోత్సవాలకు పోలీసుశాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకని బ్రహ్మోత్సవాలకు భారీగా భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. అంకిత భావంతో, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తారన్నారు. రాయలసీమలోని నంద్యాల, కుర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఆరుగురు డీఎస్పీలు, 40 మంది సీఐలు, వంద మంది ఎస్సైలు, సుమారు 1500 మంది సివిల్ పోలీసులు, 200 మంది ఆర్మ్డ్ పోలీసులు, 200 మంది ఏపీఎస్పీ పోలీసులు, మరో వంద బంది స్పెషల్ పార్టీ పోలీసులను బందోబస్తులో మోహరించినట్లు పేర్కొన్నారు.
ఉగాది బ్రహ్మోత్సవాల్లో సుమారు 800 సీసీ కెమెరాలు, మూడు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ కోసం 15 బ్లూకోట్స్, పది రక్షక్ వెహికిల్స్‌ను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. దొంగతనాలను నివారించేందుకు క్రైమ్ పోలీసుల సేవలను వినియోగించనున్నట్లు తెలిపారు. సెక్యూరిటీలో భాగంగా బాంబ్ డిస్పోజల్ టీమ్స్, క్యూలైన్స్ వద్ద తనిఖీ చేసేందుకు డీఎఫ్ఎండీ, హెచ్హెచ్ఎండీల సేవలు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో నంద్యాల ఆర్ అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, ఆత్మకూరు డీఎస్పీ రామంజీ నాయక్, శ్రీశైలం టౌన్-1 సీఐ జీ ప్రసాదరావు పాల్గొన్నారు.