Heavy Rains | అమరావతి : ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు పేర్కొంది. తీరం దాటినా తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తీరం వెంబడి 55 నుంచి 75 కి.మీ గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. అటు నుంచి వచ్చిన వరద వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదుల్లో వచ్చి చేరుతోంది. దీంతో హిర మండలం గొట్టా బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది.