అమరావతి : రానున్న 24 గంటల్లో ఏపీలోని ఆరు జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణశాఖ (Meteorological Department) హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం 12 గంటల్లో ఉత్తరం వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
రానున్న 24 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా వాయుగుండంగా కదిలి , ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. కాకినాడ (Kakinada), అల్లూరి, అనకాపల్లి, విశాఖ (Visaka) , మన్యం, విజయనగరం, శ్రీకాకుళం (Srikukulam) జిల్లాలకు భారీ వర్షాలు పడుతాయని స్పష్టం చేసింది.
తీరం వెంబడి గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, మరో రెండు రోజులు మత్స్యకారుల చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. కళింగపట్నం-మచిలీపట్నం వరకు అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు వివరించారు.