అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వానలు పడుతుండడంతో వరదలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై పలుచోట్ల భారీగా వరదనీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. నెల్లూరు జిల్లా గూడురు సమీపంలో పంబలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది.
రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 10 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో కృష్ణపట్నంకు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. సోమశిల జలశాయం ఎగువ ప్రాంతాల్లో ఉన్న ఉప నదులు, వాగులు పొంగుతున్నాయి. స్వర్ణముఖి నది ఉద్ధృతితో నెల్లూరు జిల్లా నాయుడుపేటను వరద నీరు ముంచెత్తింది. ఈ నాలుగు జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసాయి.