Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మెగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. తన తమ్ముడు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సంతోషం వ్యక్తం చేశారు. గుండెల నిండా సంతోషంగా ఉందన్నారు.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. గుండెల నిండా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందన్న భరోసా కలుగుతోందన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన, సుదీర్ఘ పాలన అందించే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకులు వచ్చారని కొనియాడారు. కొత్త, పాత కలయికలతోటి ఈ మంత్రివర్గం చాలా చాలా బాగుందని కితాబిచ్చారు. కచ్చితంగా గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఇప్పుడు చూస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు.
అదేవిధంగా.. తన తమ్ముడు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల గర్వంగా అనిపిస్తోందని చిరంజీవి తెలిపారు. ఎంతో కష్టపడ్డాక వచ్చిన విజయం ఇది అని అన్నారు. అంతా మంచే జరుగుతుందన్నారు. పవన్ తన బాధ్యతలను, మంత్రి పదవిని ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించగలడని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాడని తనకు నమ్మకం ఉందని వెల్లడించారు.
Also Read..
Pawan Kalyan | చిరంజీవి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పవన్ కళ్యాణ్
Renu Desai | ఏపీ మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. స్పెషల్ విషెస్ తెలిపిన రేణూ దేశాయ్