అమరావతి : కుటుంబ సభ్యులు, ఆడపిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawankalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన యాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపం -2 (Deepam-2) పథకం కింద ఉచిత సిలిండర్లను పంపిణీ చేసి బహిరంగ సభలో మాట్లాడారు.
సామాజిక మాధ్యమాల్లో ఆడబిడ్డలను కించపరిస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. స్వామి మీద ఆన.. వారి సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు. చింత చచ్చినా..పులుపు చావలేదన్నట్లు వైసీపీ నేతల (YCP Leaders) నోళ్లకు అడ్డుకట్ట పడడం లేదని విమర్శించారు. ఇంట్లోని ఆడవాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ (Digital Privacy Act ) అమలుల్లోకి తీసుకువస్తామని వెల్లడించారు.
దేశ సమగ్రతకు భంగం కలిగించినా, మత విద్వేషాలు రెచ్చగొట్టినా, కుల వివక్షత గురించి మాట్లాడినా పరిస్థితులు దారుణంగా ఉంటాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై ధర్మపోరాటం చేశామని, ఏనాడు అన్యాయంగా ఎదురు తిరుగలేదని అన్నారు. రాష్ట్రంలో మానవహక్కులకు భంగం కలిగితే వాటిపై మాట్లాడామని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సోదరి షర్మిలకు భద్రత కల్పించే బాధ్యత మాది అని వెల్లడించారు. సనాతన ధర్మాన్ని కాపడడం కోసం తెలుగు రాష్ట్రాల్లో నారసింహ వారాహి గళం పేరుతో విభాగం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.