నెల్లూరు జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్‌లో నిర్వాహకుల చేతివాటం బయటపడింది. సాధారణంగా పెట్రోల్ బంక్‌లో మీటర్ రీడింగ్ మ్యానిపులేట్ చేసి ఎంతో కొంత మోసం చేస్తారని చాలామంది అనుకుంటూనే ఉంటారు. కానీ నెల్లూరు బంక్‌లో మాత్రం వాహనదారుల జేబులకు పెద్ద ఎత్తున చిల్లులు పెడుతున్నారు. 400 రూపాయలకు పెట్రోల్ కొట్టిస్తే కనీసం హాఫ్ లీటర్ పెట్రోలు కూడా రావడం లేదు. ఓ వాహనదారుడికి అనుమానం వచ్చి పెట్రోల్‌ను బకెట్లోకి తీసి చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ పెట్రోల్ బంక్‌లో వాహనదారుడు 400 రూపాయలకు పెట్రోల్ కొట్టించాడు. కానీ ఎక్కువగా పెట్రోల్ వచ్చినట్లు అనిపించలేదు. బైక్‌ను అటుఇటు ఊపి చూశాడు. పెట్రోల్ తక్కువగా ఉన్నట్లు అనుమానం రావడంతో బైక్‌ను పక్కకు ఆపి.. బకెట్లో పెట్రోల్‌ను తీయడంతో బంక్ నిర్వాహకుల బాగోతం బయటపడింది. బకెట్లోకి కనీసం అర లీటర్ పెట్రోల్ కూడా రాలేదు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. దీనిపై వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మీటర్లను మ్యానిపులేట్ చేస్తూ ప్రజలను పెట్రోల్ బంక్ నిర్వాహకులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని వాపోయారు.