Gudivada Amarnath | వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్‌తో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వం ప్రకటనపై ఏపీ మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వాస్తవానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రచారంపై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా.. మంత్రి నారా లోకేశ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆయన నన్ను గుడ్డు అని అంటే.. నేను పప్పు అని అంటానని.. ఇలా వ్యక్తిగత విమర్శల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనమేమీ ఉండదని హితవు పలికారు.
గూగుల్ డేటా సెంటర్‌తో ఒప్పందం కారణంగా భారీగా ఉద్యోగాలు వస్తాయని ప్రచారం జరుగుతుందని నారా లోకేశ్ తెలిపారు. దీనిపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇస్తారేమో అని భావించానని అన్నారు. కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ డేటా సెంటర్‌ను వైసీపీ వ్యతిరేకిస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్‌ను స్వాగతిస్తున్నామని ఆనాడే వైసీపీ తెలిపిందని గుర్తుచేశారు. కేవలం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందని మాత్రమే అడిగామని.. అందులో తప్పేముందని నిలదీశారు.
వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కానీ ఆ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 1.88 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. మరి మన ఒక్క రాష్ట్రంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. అయినా ఉద్యోగాల గురించి చెప్పాల్సింది లోకేశ్, టీడీపీ నేతలు కాదని అన్నారు.ఈ విషయంపై గూగుల్‌నే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలపై గూగుల్‌తోనే చెప్పించాలని గుడివాడ అమర్నాథ్ సూచించారు. కనీసం ఆ సంస్థతో అధికారికంగా ప్రెస్‌నోట్ అయినా రిలీజ్ చేయించాలన్నారు. నిజంగా రెండు లక్షల ఉద్యోగాలు రావడం నిజమని తేలితే.. మేమే సన్మానం చేస్తామన్నారు.
అసలు గూగుల్‌తో సమాధానం చెప్పించడానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను గుడ్డు అంటే.. నేను పప్పు అంటానని ఎద్దేవా చేశారు. నన్ను గుడ్డు అన్నా.. నేను లోకేశ్‌ను పప్పు అన్నా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని.. ముందు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. మాయమాటలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయవద్దన్నారు.
విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీల నీళ్లు అవసరమని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గూగుల్ డేటా సెంటర్‌కు 3 టీఎంసీల నీళ్లు అవసరమని.. ఎలా సర్దుబాటు చేస్తారని ప్రశ్నించారు. డేటా సెంటర్ వల్ల ఒకటి నుంచి రెండు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారని.. దాని మీద ఏమైనా స్టడీ చేశారా అని నిలదీశారు. ఒక రోజు మొత్తానికి విశాఖ నగరానికి ఎంత కరెంట్ అవసరం, గూగుల్ డేటా సెంటర్‌కు ఒక గంటకు ఎంత కరెంట్ అవసరమవుతుందనేది తెలుసుకున్నారా అని అడిగారు.
నువ్వు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చావని.. నేను మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చామో కూర్చుని రాసుకుందామా అని నారా లోకేశ్‌ను గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అమరావతి రోడ్లు తప్ప మంత్రిగా రాష్ట్రానికి నువ్వు ఏం చేశావని ఎద్దేవా చేశారు. నేను వెటకారంగా మాట్లాడటం మొదలు పెడితే లోకేశ్ భరించలేరని అన్నారు. వర్దంతికి జయంతికి తేడా తెలియని వ్యక్తి కూడా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. ఆయనలా నేను ఎవరి స్క్రిప్ట్ తీసుకొని చదవనని అన్నారు. ట్రోలింగ్‌కు జాతిపిత లోకేశ్ అని సెటైర్ వేశారు. వ్యక్తిగత విమర్శలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.