Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాలతో అక్క మహాదేవి మండపంలో శాస్త్రోక్త పూజలు జరిపించారు.
అటుపై స్వామి అమ్మవార్లకు ఆలయోత్సవం నిర్వహించినట్లు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. దివ్యకాంతులను ప్రసరింప జేస్తూ భక్తులకు వరాలిచ్చే స్వామి అమ్మవార్ల అశ్వ వాహనసేవను వీక్షించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు.
అమ్మవారికి ప్రీతికరమైన కాగడాలు, ఎర్ర గులాబీలు, తెల్లచామంతి, ఊదా చామంతి, మందారం, లిల్లీ, ఎర్ర గన్నేరు, ఊద గన్నేరు, దేవ గన్నేరు, నంది వర్ధనం, గరుడవర్ధనం, తెల్లచామంతి తదితర 21 రకాల ప్రత్యేక పుష్పాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు.
జామ, ఖర్జూర, నల్లద్రాక్ష తదితర 9 రకాల పండ్లతోపాటు బిల్వం, మరువం మాచీపత్రితో ప్రత్యేకంగా అలంకరించిన శయనమందిరంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఏకాంతసేవగా శయనోత్సవాన్ని నిర్వహించినట్లు ఈవో తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులతోపాటు ఆలయ అధికారులను, సిబ్బందిని అభినందించారు.