Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 13న వార్షిక ఆరుద్ర ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతి నెలలో ఆరుద్స ఉత్సవం నిర్వహిస్తుండగా.. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున వార్షిక ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా 12న రాత్రి 10 గంటల నుంచి మల్లికార్జున స్వామివారికి మహాన్యాస పారాయణం, లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 13న తెల్లవారు జామున స్వామివారికి ప్రాతఃకాల పూజల అనంతరం నందివాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 12న రాత్రి 10 గంటలకు ఉత్సవం నిర్విఘ్నంగా జరగాలని మొదట గణపతిపూజ జరుపుతారు. అనంతరం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ.. దేశం సుభిక్షంగా, సుఖశాంతులతో విలసిల్లాలని వేదపండితులు సంకల్పం పటిస్తారు. ఆ తర్వాత మహాన్యాసాన్ని జరిపి స్వామివారికి లింగోద్భవకాల రుద్రాభిషేకం చేస్తారు. పంచామృతాలు, ఫలోదకాలతో పాటు ఆలయ ప్రాంగణంలోని మల్లికాగుండ పుణ్యజలంతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహిస్తారు.
ఆలయ అర్చకులు, వేదపండితులు రుద్రమంత్రాలను పఠిస్తూ అభిషేక క్రతువులు జరుపుతారు. ఆ తర్వాత స్వామివారికి అన్నాభిషేకం, పుష్ప, బిల్వదళాలతో విశేష పూజలు నిర్వహిస్తారు. 13న వేకువ జామున ఉదయం 3 గంటలకు మంగళవాయిద్యాలు, అనంతరం 3.30 గంటలకు సుప్రభాత సేవ జరుగుతుంది. ప్రాతఃకాలపూజలు తర్వాత భ్రమరాంబ సమేత మల్లికారుజన స్వామివారల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ముఖమండప ఉత్తర ద్వారాన్ని తెరిచి భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. అనంతరం ఆలయ ఉత్తరభాగంలోనే నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపి.. క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. గ్రామోత్సవం తర్వాత ఉదయం 6 గంటల తర్వాత నుంచి భక్తులను దర్శనాలు, ఆర్జిత సేవలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.