అమరావతి : టీటీడీ ఈవో( TTD EO) గా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు (Shyamala Rao) తన పనితనాన్ని వేగిరం చేశారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
తిరుమలలో ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కాలనడకన వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు పడే వారు. దీంతో ఈ సమస్యను గమనించిన ఈవో మంగళవారం తిరుమలలో అవసరమైన అన్ని పాయింట్ల వద్ద కూలెంట్ పెయింట్(Coolant paints) లు వేయించారు.
గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం జరిగిన ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశంలో భక్తుల దృష్ట్యా వైట్ కూలెంట్ పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో మంగళవారం ఆ పనులు చేపట్టారు. ప్రధాన ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపం, రాంభగీచ తదితర భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నాలుగు మాడ వీధుల్లో తెల్లటి శీతలకరణి రంగులు వేశారు. దీంతో తిరుమల దర్శనానికి వచ్చి పోయే భక్తులు సులభంగా నడిచివెళ్లేందుకు వీలుగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.