Maha Shivratri | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దాదాపు 11 రోజుల పాటు ఉత్సవాలు దేవస్థానం వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు దేవస్థానం అధికారులు, అర్చకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు విజయవంతయ్యేందుకు సహకరించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే తరహాలో జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు.
ప్రతి ఉద్యోగి భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ వహించాలని సూచించారు. ఎక్కడా అసౌకర్యం కలుగకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను మేరకు ఏర్పాట్లలో నిమగ్నం కావాలని చెప్పారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19న మొదలవుతాయని తెలిపారు. భక్తులు ముందస్తుగానే శ్రీశైల క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమష్టిగా విధులు నిర్వర్తించాలని చెప్పారు.
వైదిక సిబ్బంది, ఆలయ విభాగ అధికారులు పరస్పర సమన్వయంతో ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కైంకర్యాలన్నీ సంప్రదాయబద్ధంగా జరిపించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు. ఉత్సవాల్లో కైంకర్యాల సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు. మహాశివరాత్రి పర్వదినమైన ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, మరుసటి రోజున నిర్వహించే రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. పాదయాత్రగా వచ్చే భక్తుల సౌకర్యార్థం పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి తదితర చోట్ల చేయాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు.
శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, జ్యోతిర్ముడి సమర్పణకు ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నారు. క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా దర్శనం కోసం బారులు తీరే భక్తులకు ఎప్పటికప్పుడు మంచినీరు, అల్పాహారం అందజేయాలని అన్నప్రసాదవితరణ విభాగాన్ని ఆదేశించారు. ఇందు కోసం స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. క్యూలైన్లలో బారికేడ్లు ధృడంగా ఉండేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుధ్యంపై దృష్టిసారించాలన్నారు.
పార్కింగ్ ప్రదేశాల వివరాలు స్పష్టంగా తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులకు లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో పోలీస్‌శాఖ సహకారం తీసుకోవాలన్నారు. పాతాళగంగలో రక్షణ ఏర్పాట్లు, దస్తులు మార్చుకునేందుకు అవసరమైన గదుల ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ ఈవో ఆర్ రమణమ్మ, ప్రధాన అర్చకులు వీరస్వామి, ఉమానాగేశ్వరశాస్త్రి, పూర్ణానంద ఆరాధ్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.