విజయవాడ : రాజమండ్రిలోని ధవళేశ్వరం డ్యాం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. 25.64 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 21.60 అడుగుల నీటిమట్టం ఉన్నది. దాదాపు 8 రోజుల తర్వాత వరద తగ్గుముఖం పట్టినా వరదలతో లంక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. స్పిల్‌వే వద్ద నీటిమట్టం 36.91 మీటర్లకు చేరుకోవడంతో పోలవరం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతున్నది. 48 గేట్లను ఎత్తి 21.88 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను మించి వరద ప్రవాహం ఉంటుందని అధికారులు అంచనా వేసినా.. ఇప్పటి వరకు నిండే పరిస్థితి లేదని వారు చెప్తుండటం విశేషం.
మరోవైపు విలీన మండలాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. చింతూరు, కూనవరం, ఏటపాక, వీఆర్ పురం మండలాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఈ మండలాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఏటిపాక మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, వీఆర్ పురంలో ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. పునరావాస కేంద్రాల్లో నీరు, కరెంటు లేకపోవడంతో బాధితులు అనేక అవస్థలు పడుతున్నారు. తమ గోడు పట్టించుకునే వారు కరవయ్యారని బాధితులు వాపోతున్నారు. తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తున్నదని, మహిళలు, చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణుగోపాలకృష్ణ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం ఆదేశాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మందులు, ఆహారం, తాగునీరు, పాలు అందుబాటులో ఉండేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, దేవీపట్నం మండలాల్లో పరిస్థితిని మంత్రులు ఏరియల్ వ్యూ ద్వారా సమీక్షించారు.